Monday, July 21, 2014

CHINNANAATI PREMA....!!!

పక్వం లేని జ్ఞానం ... పసలేని ధ్యాస 
పడిలేచే అడుగులు ... ఎటువైపో ఆలోచనలు 
అమ్మ పిలిచింది ... నిద్ర లేచింది 
కంగారు వణికింది ... సమయం దాటింది 
గంట మోగింది ... గొంతు పాడింది 
చూపు పలికింది ... చూపు బెనికింది 
కర్ర లేచింది ... చేయి చాచింది 
పాఠం పరిమళించింది ... మెదడు మందగించింది 
ప్రశ్న వచ్చింది ... చూపు నేలకేసి చూసింది 
కాగితం ఎదురొచ్చింది ... కలం తెల్లబోయింది 
ప్రతిభ ప్రగతి వెనుక వైపు ... నాన్న తిట్ల దండకం ముందువైపు 
తల పుస్తకం వైపు ... కడుపు ఆకలి వైపు 
చేతలు అమ్మవైపు ... నాన్న చూపు నావైపు 
అమ్మ నాన్నవైపుకి ... నడక ... నాన్న నావైపుకై ... తపన 
అలక ... పాన్పు ఎక్కింది ... కౌగిలింత ఒడిని చేరింది 
అమ్మ పిలిచింది ... నిద్ర లేచింది ... !!!

Saturday, July 12, 2014

SNEHA HRUDAYA LAYALU...!!!

చిన్ని ఉత్సాహంతో ఆరంభమైన ప్రయాణం ...
అంతరంగంలోని అన్ని కోణాలనూ జేరె ...
మనసు విహంగ వీక్షణాధ్యయనం
మెదడు మెరుపు పదును కొరకు ...
స్నేహ కనుల స్పందనలు
సహృ'దయ' లయలు ప్రేమను పంచెను ...
తెంచెను ప్రేమను ... నిశ్చల విగ్రహ హృదయ
పరిపుష్ట కుయుక్తుల వ్యక్తుల చేతలు
గ్రహింపక ... చెంతన చేరిన వాత్సల్యపు యద
దారి తీరం చేరెను ... మరల స్నేహ రక్షణ
కవచముల జేరె ... తేనె మధురపు స్నేహ గాలి వలన ... !!!

Thursday, July 3, 2014

IKA CHAALINCHU...!!!

అపకారికి ఉపకారము నెపమెన్నక
సేయువాడు నేర్పరి ....  సందేహము వలదు !
అధికారిక నీతికార్యమున ... నీచగుణం
ప్రదర్శింప ప్రోత్సహింప 'హితుడా' ... ఓ నటుడా ...
కార్యసిద్ధికి తలవంపక 'హితుని' మాట మన్నింపక ...
వినమ్ర కార్యదక్షుడనైన నాకా ...
ఆ నాటకుడి మాట తూటా ...?! నిర్లక్ష్యపు కోరలతో
అతీగతీ లేని నీ నీతిహీన పుణ్యపలుకులు మాకేల .... ?!
పరవంచన చేరి పసలేని సణుగుడు గుణ ఛండాలం ..
నీ అంతరంగం ...!!! బహిరంగంలోనే కదా తెలిసేది
ఎవరి సామర్ధ్యం సాధారణమో ... అసాధా'రణ'మో ....!!!

Sunday, June 22, 2014

AVVA...?!

జీవితం ... ఒక విచిత్రం.. ! మనం ఎంత ఆలోచించినా అర్థంకాని విషయాల్లో జీవితం కూడా ఉంటుంది. అందరి జీవితాలు అన్ని సమయాల్లో ఆనందంగా ఉండటం అసాధ్యం. ఉన్న అతికొద్ది సదుపాయాలతోనే తమ జీవన గమనంలో ముందుకు వెళ్తున్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు . ఆబోటి వాళ్లకు కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన పనిలేదు, వాళ్ళు ఆనందంగా ఉండటానికి సగటు సదుపాయాలు కల్పిస్తే చాలు .... ఇదే విషయం నా క్షేత్ర పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లా కొయ్యలగూడెం  గ్రామానికి వెళ్ళినప్పుడు తెలిసింది . చేనేత కార్మికుల పని నైపుణ్యం, అలాగే వారి వృత్తిగత మరియు వ్యక్తిగత ఇబ్బందులను తెలుసుకుందామని హైదరాబాద్ నుండి బయలెల్లిన నాకు, కొయ్యలగూడెం గ్రామంలోకి అడుగుపెట్టగానే చేనేత కళ అద్భుత స్వాగతం పలికింది. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎనభై శాతం మంది చేనేతపైనే ఆధారపడి ఉన్నారు . చేనేత కార్మికుల పనితనాన్ని తెలుసుకుంటూ వెళ్తూ ఉండగా .. ఒక అవ్వ తన ఇంటిముందు ... ఎవ్వరినీ పట్టించుకోకుండా పనిలో తీవ్రంగా నిమగ్నమై ఉంది . ఎంతగా అంటే నేను వెళ్లి ఆ అవ్వ ముందు నిలబడినా .. నువ్వు ఎవరు బాబు? అని కూడా అడుగలేదు. ఒక పది నిముషాలు దాటిన తరువాతగానీ ఆ అవ్వ నావంక చూడలేదు. ఆ పది నిముషాల్లోనే నాలో ఎన్నో ప్రశ్నలు...!నన్ను చూడగానే..  అవ్వ నా గురించిన వివరాలని అడిగితే అన్నీ చెప్పాను. ఆ అవ్వని తన పేరడిగితే మాత్రం చెప్పలేదు . ఆ తరువాత ఆ అవ్వకు నాకు మధ్య జరిగిన సంభాషణ ఈవిధంగా ఉంది ..
నేను: అవ్వ నువ్వు ఏం పని చేత్తానవ్... ?
అవ్వ: కండెలు బడతాన బిడ్డా ...
నేను: రోజుకు ఎన్ని కండెలు బడతవ్ ?
అవ్వ: రోజుకు నల్ఫై పడ్త కొడుకా ..
నేను : గింత పని జేత్తే ఎన్ని పైసల్ అత్తయ్ ?
అవ్వ: రోజుకు ఎన్ఫై రూపైలిత్తరు ...
నేను : మీ పెద్దమనిషి ఏం జేత్తడు ...?
అవ్వ : నా పెద్దమనిషి నన్నిడ్షిపెట్టి పోయి ముప్ఫై యేండ్లు అయితంది బిడ్ద .... ఐనగుడ గిదేపని  జేసిండు ....
నేను : పిల్లలు ఎంత మంది ఉన్నరు అవ్వ .?
అవ్వ : నలుగురు బిడ్డలు ... ఒక్కడే కొడుకు .. అందరికి పెండ్లిళ్ళు అయినై ..
నేను : నువ్వు ఎవరితాన ఉంటానవ్ అవ్వా ... ?
అవ్వ: నేనొక్కదాన్నే ఉంటాన ...
నేను : ఎందుకవ్వా .... నీ కొడుకెక్కడ ఉంటడు .... ఇంతకు ఆయన ఏం జేత్తాండు ... ?
అవ్వ : ఇప్పుడు వాడు దుకాణం పెట్టుకున్నడు .. ఇంతకుముందు వాడుగుడ బట్టవడ్తుండే ... ఇండ్ల పైసల్ అత్తలేవని దుకాణం పెట్టుకున్నడు ....
నేను : మరి ఒక్కదానివే ఇంట్ల ఎట్లా ఉంటానావ్ అవ్వా .. నీ కొడుకు దగ్గర్నే ఉండకపోతివి ... ?!
అవ్వ : నేనేం జెయ్యాలె బిడ్డా ... వానికి పెండ్లి  జేసినసంది నన్ను పట్టించుకుంటలేడు ...
నేను : ఎమన్నా కొట్లాడుకున్నరా అవ్వా ... !!!
అవ్వ : (ఏడుస్తూ ).... ఏం జెప్పాలె కొడుకా ... నా కోడలు జెప్పిందే ఇని నన్ను ఇంట్లకెళ్ళి బైటికి ఎల్లగొట్టిండు ....
నేను: మరి ఎట్లా వండుకుంటానవ్ అవ్వా ... పైసల్ సరిపోతానయా ... ?!
అవ్వ : ఎక్కడ సరిపోతానై కొడుకా ... !!! పించని రెండు వందలిత్తరు ... రేషనోల్లు నాలుగు కిలోల బియ్యం ఇత్తాండ్లు .... పనిజేశేసరికి కండ్లు పోతానై ... కాళ్ళు గుంజుతానై .... (ఏడుస్తూ)... నన్ను ఎవ్వరడుగుతలేరు ..
నేను: నీకేం గావలె జెప్పు .... అవ్వ ... !!!!
అవ్వ : నేనెవ్వరి దగ్గరికి పోను(కొడుకుని ఉద్దేశించి) .. పించని సరిపోతలే ... సర్కారోల్లు రెండు వేలియ్యాలే  ... పనికి పైసలు గూడా పెంచాలె ... ఇంగప్పుడు  నన్నెవ్వలేమనరు ...
నేను నా మనసులో : ఆత్మాభిమానం ఉన్న వాళ్ళెవరైనా ఇలాగే అంటారు ....

మానసిక ప్రశాంతత లేనప్పుడు .. వారి వారి సొంత ఆదాయమే వారికి స్వాంతన చేకూరుస్తుంది ... అలాంటిది వారికి వారి పనే ఆదాయ వనరు కానప్పుడు ... జీవితం మరింత అసంతృప్తిగా ఉంటుంది ..  

Thursday, April 3, 2014

NAA PAATHAM...!!!

ప్రశ్నించే ప్రతీ వ్యక్తి జ్ఞాని కాదు ...
గడ్డం పెంచిన ప్రతీ వాడు మేధావి కాదు ...
మాటకారి మితవాదిగా మారవచ్చు ...
మౌనముని గొప్ప వక్తగా ఉండవచ్చు ....
తెలియనివాడు లోకజ్ఞానం లేనివాడు కాకపోవచ్చు ...
అనుభవజ్ఞుడు నిష్ణాతుడు కాలేకపోవచ్చు ...
కానీ ... పాఠం .. గుణపాఠం తెలిసినవారు ...
అన్నింటిలో మిన్నగా ఉంటారు ... !!!

Tuesday, January 14, 2014

SANKRANTHI..!!!

సాంస్కృతిక వేదిక ...
సంప్రదాయాల వేడుక ...
కుటుంబాల కలయిక...
ఆనందాల డోలిక ... అనుబంధాల మాలిక ... సంక్రాంతి ... !
అనిర్వచనీయం ... గాలిపటాల ఆకాశయానం ...
రుచిర్వచనీయం ... పిండి వంటకాల సేవనం ... !
సుందరకమనీయం ... ముగ్గులొలికిన వాకిట్లలోన ...
నేత్రపర్వ రమణీయం ... గంగిరెద్దుల విన్యాసాల్లోన ... !
సరదాల సంక్రాంతి ... మనందరికీ మరో దసరా సంక్రాంతి ... !!!