Saturday, November 24, 2012

EDURU CHUPULU ... !!!

నిన్ను  చూసిన మొదటి క్షణం...
నన్ను నేను మరిచిపోయాను...!
నీతో మాట కలిపిన మొదటి క్షణం...
నా మాటలకి అర్థం తెలిసింది...!
నీ స్పర్శ తెలిసిన మొదటి క్షణం...
నా జీవితం విలువ తెలిసింది...!
నీతో వేసిన తొలి అడుగు మొదటి క్షణం...
నేను వేయబోయే తదుపరి ఆరు అడుగులు
నీతోనే అని తెలిసివచ్చింది...!!
నీ  ఊహలే... ఊపిరిగా... ధ్యాసగా...
నా జీవితానికే సాధికారతనిచ్చే 
సంకీర్తనగా మారిన తరుణంలో...
మన భవిష్యత్ జాతక గమనం
ఆ భగవంతుని ఆశిస్సులకై ఎదురుచూస్తోంది ...!!!

Thursday, November 15, 2012

PREMA...!!!

నీవు చేయగలది చేసేయ్ ... నీ ప్రేమతో
నీలో ప్రేమ  ఎక్కడైతే ఉన్నదో  అక్కడినుండే... నీలోని ప్రేమతో
ఇదే ఆనందం నిజమైన జీవితానికి
నిన్ను నీవే గుర్తించుకో ... ఇతరుల ప్రేమతో
నిన్ను నువ్వు స్థాపించుకో... నీ ప్రేమతో .. అది నిన్ను నిలబెడుతుంది
నీలో ఏదైతే దాగివుందో అదే నిన్ను కాపాడుతుంది
ప్రేమ ఒక సందర్భం కావాలి ...
ఒక కారణం కారాదు ... !!!

Thursday, October 18, 2012

NAA DAARI...!!!

సమస్యలేని తీరం కోసం సాగుతున్న ఈ సముద్ర ప్రయాణానికి, ఎదురయ్యే తీరమే ఒక సమస్య అయితే...?!
తీరానికి భయపడి, బాటలేని సాగర మథన ప్రయాణం సంకటమా...?!
తీరానికి ఎదురొడ్డి, తీరరేఖనే ఖండించే ఖడ్గచూపు సమంజసమా...?!
మథనం లేని ప్రయాణం...
ధైర్యం లేని చూపు...
చేవలేనితనానికి నిదర్శనమా...?!
ఏదేమైనా...
బాటలేని సముద్రానికి, దిక్కులనే దారులుగా భావించి...
ముందుచూపుతో నూతన బాటను సృష్టించడం ఉత్తమం...!!!
అందుకే ఈ నా ప్రయాణం ...!!!

Tuesday, October 2, 2012

VIMUKTHI...!!!

మన బంధాలు గుండె చప్పుళ్ళ లాంటివి. మన గుండె లబ్ డబ్ అని మోగినట్లుగానే, మన జీవితంలోని బంధాలు ఉంటాయి. హృదయలయల మాదిరిగానే బంధాలు ఒకటి కనుమరుగవుతుండగానే ... మరొకటి వచ్చి చేరుతుంది. మన జీవిత మనుగడకు ఈ హృదయ లయలు ఎంత ముఖ్యమో, మన పాత బంధాలు అంతే ముఖ్యం అని నమ్మే వ్యక్తిని నేను! అలాంటిది ఒక లయ నాకు తెలియకుండానే వెళ్ళడానికి సిద్దపడితే ... కాదనడానికి నేను ఎవరిని ...?! సృష్టింపబడిన నిన్ను నా సృష్టిలో ఒక భాగం  చేసుకున్నానే తప్ప నీలో నేను భాగం కాలేదు ... ఇకపై కాబోను కూడా ...!!!
మన జీవితం అయోమయం. ఈ అయోమయ జీవితంలో బంధాలు మరికొంత గందరగోళం సృష్టిస్తాయి. మనం కావాలనుకున్నది మన ఒడిని  చేరదు... మనకి దక్కిన దానితో సంతృప్తి చెందము... మనకు ఇష్టంలేనివి సాధారణంగా జరుగుతుంటాయి... ఇదే జీవితమంటే!!!
ఈ అయోమయంలో మన చిరునవ్వును  కూడా మరిచిపోతాము ... ఈ బంధాల అతి వలన...! నేనలా ఉండాలనుకోవట్లేదు...! నన్ను విడిచి  వెళ్ళిన ఆ బంధాల తీరుతెన్నుల గురించి ఆలోచించి నా మనసుని  మూగపరుచలేను...!!!

Wednesday, September 19, 2012

NEEKOSAM ... !!!

నా గతం గుర్తుచేస్తోంది ... నువ్వు నన్ను కలిసావని ...
నా భవిష్యత్తు అంటోంది ... నువ్వు నాకోసమే ఉంటావని ...
నా వర్తమానం చెబుతోంది ... నువ్వు నన్ను అర్థంచేసుకుంటావని ...
నేను అంటున్నాను ... ఈ  హృదయం ఊగిసలాడుతోంది నీకోసమేనని ...
నా  ఆలోచనలు అంటున్నాయి ... ఈ అందమైన కలలు నీకోసమేనని ...
మొత్తంగా ... నేనున్నాను నీవై ... నీకై ... మనకై ... !!!

Wednesday, September 12, 2012

GNAAPAKAALU...!!!

జ్ఞాపకాలు, వాటికి మాత్రమే సొంతమైన మార్గాలను కలిగి ఉంటాయి . మనము ఎప్పుడైతే పది మందిలో ఉంటామో ... అప్పుడు జ్ఞాపకాలు మనల్ని ఒంటరిని చేస్తాయి. కానీ, మనము ఏకాంతంగా  ఉన్నప్పుడు అవే జ్ఞాపకాలు మనల్ని చుట్టుముడుతాయి. మనం ఒకరిని మనస్పూర్తిగా ఎప్పుడైతే ఇష్టపడుతామో, అప్పుడు వారు చేసిన తప్పులు మన అభిప్రాయాలను మార్చలేవు. ఎందుకంటే మన ఆలోచనలు కోపంగా ఉంటాయే కాని ... వారితో మనం గడిపిన జ్ఞాపకాలు కాదు ...!!!

Wednesday, September 5, 2012

EDURU CHUPULU ...!!!

  చూడాలని ఉన్నా ... మాట కలపాలని ఉన్నా ...
నేస్తమున్న వేళ ... కాలు కదపలేకున్నా  ... !
పెదవి కదలదాయె ... ఎదుటి మనసు కరగదాయె ...
చూపు నోచుకోని చోట ... నోట మాట రాని పూట ...

నీకై ఎదురు చూపులే ... నా కంటికి ఆశాజ్యోతులై ...
నీ స్నేహానికి బాట చూపుతాయి ... నా మనసుకి హాయి గొల్పుతాయి ...

నీ స్పందనకై స్పందిస్తున్న ఈ చిన్ని హృదయాన్ని ...
నీ మాటతో పలుకరిస్తావని ఆశిస్తూ ...
                                                      నీ శ్రేయోభిలాషి !!!

Saturday, September 1, 2012

APARICHITHA BHAGYAM ...!!!

సంక్లిష్టమైన మన దైనందిన జీవితంలో,   ప్రతి రోజు ఎన్నో  ఆలోచనలు మరెన్నో పనులు. ఈ మన  ఆఘమేఘాల జీవితానికి పరిపూర్ణ ఆనందం లభించేది కొద్ది సమయమే ... అయితే మనం  ఈ  సమయాన్ని కూడా మనసులో దాచిపెట్టుకోవడం లేదు ... 
ఈ మధ్యనే నాకు ఒక అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ అపరిచిత వ్యక్తి ఎవరో  తెలుసుకోవాలనే ఆత్రుతతో ... "మీరు ఎవరో తెలుసుకోవచ్చా ...?!" అనే ప్రశ్నతో నా పరిచయాన్ని కూడా ముందుకు సాగించా ...
ఆ అపరిచిత వ్యక్తిలోని నిజాయితీ ... నా ప్రశ్నలకి ... సమాధాన రూపంలో వచ్చేవి  ... వస్తున్నాయి కుడా ..!!! అపరిచితులం కాస్త పరిచయస్థులమయ్యాము. కొత్త పరిచయాల్లో మాటల మధ్యలో ప్రశ్నలకి ఉన్న విలువ చాలా గొప్పది. ఎందుకంటే ... ఈ ప్రశ్నలే మనలోని నిజమైన మనసుని మనిషిని బయటికి  తెస్తాయి. ఈ  ప్రశ్నల పరంపరలోనే ... ఈ అపరిచిత వ్యక్తి  ఎవరో నాకు తెలిసింది. ఈ అపరిచిత వ్యక్తి విషయాలు తెలుసుకునే క్రమంలో నా పాత  స్నేహితుల విషయాలు తెలిసాయి. నా పాత విషయాలూ గుర్తుకు వచ్చాయి .  ఇప్పుడు  ఆ అపరిచిత వ్యక్తితో మంచి స్నేహం కుదిరింది. బహుశా ...." అపరిచిత భాగ్యం" అంటే ఇదేనేమో ...?!

Thursday, July 19, 2012

PUVVAITHE...!!!

 వికసించిన ప్రతీ హృదయం వెనుక ఎన్నో మధురానుభూతులు... మరెన్నో చేదు  జ్ఞాపకాలు ఉంటాయి...
మన హృదయం కూడా ఒక పువ్వు లాంటిదే..!!! విచ్చుకున్న  పువ్వు మనకు ఎంతో అందంగా కనపడుతున్నా ...  ఆ అందం వెనుక ఎన్నో ఆటుపోట్లు దాగి ఉంటాయి. ఒక మొగ్గ, పువ్వుగా వికసించే క్రమంలో అది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడగలగాలి. అంతే కాకుండా  కృత్రిమంగా కలిగే నష్టాలనూ భరించాలి. ఇంత జరిగినా... ఆ వికసించిన పువ్వు మాత్రం ... తనకి ఏమీ తెలియదన్నట్లుగా ...మన కంటికి హాయినిగొలిపే  అమాయకపు అందాన్ని ఇస్తుంది. అంతే కాకుండా, తన మీద ఆధారపడ్డ చిన్న జీవాలకు ...  బ్రతుకు జీవుడా ! అంటూ మకరందాన్ని ఇస్తుంది.
మన మనసు విచ్చుకున్న పువ్వైతే ...   మన  జీవితం పదిమందికి ఉపయోగపడేలా ఉంటుంది ...!!!

Friday, March 9, 2012

THELIYANI NIJAM...!!!

మనం పుట్టిన దగ్గరి నుంచి మనకు తెలిసిన మనకు ప్రీతిపాత్రమైన  బంధాలు  ప్రేమ రూపంలో, ఆప్యాయతగా ఒక రక్షణగా ఉంటాయి. మనకు ఊహ తెలియని వయసు నుండి మనకు మనంగా పెద్ద మనుషులుగా భావించే స్థితి వరకు చేరుకున్నా.. ఆ బంధాలు మన వెన్నంటే ఉంటాయి. మనం ఒకానొక వయసుకి వచ్చాక ... మనకు తెలియకుండానే, మనవి కాని విషయాలకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రముఖంగా మన ఏకాగ్రతను నిలుపుతాము. వాటినే మన బంధాలుగా, చాలా సందర్భాల్లో మన జీవితాలుగా భ్రమ పడతాము. ఆ భ్రమ ఎంత ప్రభావితంగా ఉంటుందంటే ... మన వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టేస్తాము. కానీ, కొన్ని విషయాలు మన వెన్నంటే ఉండి మనకు అండదండలుగా ఉండి, చివరకు అవి కూడా ఒక బాధగా మారిపోతాయి. అయితే ఇక్కడ లోపం మనది. ఎందుకంటే, ప్రతీ విషయాన్ని అతిగా మనలో మనమే చూసుకోవడం. లోపం మనలో మాత్రమే కాకుండా ఎదుటివారిలో కుడా ఉంటుంది... కారణం, వారు మన శరీరాలను శరీర హావభావాలను గమనిస్తారే కాని... మన ఆలోచనలను గమనించరు. ఈ కాస్త విషయం తెలుసుకునేలోపే ... జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఎంతైనా అనుభవిస్తేగాని తెలిసివచ్చే గుణాలు కావుగా...మనవి!!!
అతిప్రాధాన్యత మరియు ప్రాధాన్యం లేని విషయాలు మూల్యం చెల్లించేవిగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి సుమా ...!!!

Friday, February 10, 2012

GULABI...!!!

"గులాబీని ప్రేమకు గుర్తుగా ఎందుకు భావించాలి...?" - ఈ ప్రశ్న ఒక స్నేహితురాలి సందేహానికి ప్రతిరూపం ...!
ఎలా అయితేనేం ఈ ఒక్క ప్రశ్న నాలో ఇన్ని రోజులుగా దాగివున్న, బయటికిరాని నా అనుభవాలని మీతో పంచుకోవడానికి ఒక వారధి అయ్యింది. 
" ఆకర్షించే అందమే కాదు... ఆ అందంలో ఉండే అమాయకత్వానికి గులాబీ ఒక ప్రతిరూపం. ఒక గులాబీ జీవితానికి అవసరమైన అన్ని అంశాలను ఎంతో చక్కగా వివరిస్తుంది. మా పెరట్లో మూడు గులాబీ మొక్కలను పెంచుతున్నాము, అందులో ఒకదానికి గులాబీల ఊసే తెలియదు. ఇక రెండవది, మొదట్లో లేత గులాబీల అందంతో నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత ఇది కూడా గులాబీలను మాకు ఇవ్వడం ఆపేసింది. ఇక మూడవది, కాస్త ఆలస్యంగానైనా ... ఎంతో అందమైన, ఆకర్షణీయమైన మరియు అమాయకత్వపు గులాబీలను మాకు అందిస్తోంది... వాటి వికసించే గుణం ఎలా ఉందంటే .. మొగ్గ పూర్తిగా వికసించడానికి సుమారుగా పది రోజుల సమయం పడుతోంది! పదోరోజు మాత్రం వాడిపోయే స్థితికి వచ్చేస్తోంది. మాకు ఆ వాడిన అందాన్ని చూస్తున్నపుడు బాధగా వున్నా ... అది కొద్ది రోజులకే మరో కొత్త గులాబీ అందంతో మాకు తిరిగి దర్శనమిస్తోంది. మన జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఇంతే!!! మనకు కొన్ని నెరవేరకుండా మిగిలిపోతే ...మరికొన్ని చేయిదాకా వచ్చి చేజారుతాయి ... ఇంకొన్ని నెరవేరి ....కొత్త అవకాశాలను కూడా సృస్టిస్తాయి... జీవితానికి ఆనందాన్నిస్తాయి, ఆ ఆనందం మన ముఖానికి అందాన్నిస్తుంది.!!! 
ఇక నేను ప్రేమకు నిర్వచనం చెప్పేంత గొప్పవాడిని కాదు... కాని కొన్ని విషయాలు మాత్రం చెప్పగలను. ప్రేమ అనేది గులాబీ అంత అందంగా ఉంటుంది. అయితే ఇంతగా ఆకర్షించే ఆ అందమైన ప్రేమలో కొన్ని భయాలు ...ఆందోళనలు కూడా ఉంటాయి. గులాబీని దూరం నుండి చూస్తే ఎవరికైనా ఆకట్టుకునే విధంగానే కనిపిస్తుంది. కాని , ఆ అందమైన గులాబీ రేకుల కిందవుండే ముళ్ళు గుచ్చినప్పుడు ఉండే బాధ అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ ముళ్ళు  ప్రేమను రక్షించేవే కావచ్చు...  ప్రేమను తిరస్కరించేవే కావచ్చు లేక ప్రేమించే వ్యక్తి తనకు తానుగా ఇతరులకు దూరంగా ఉండటానికి సృష్టించుకున్నవే కావచ్చు. ఏదేమైనా ఆ గులాబీని మనం ప్రేమించే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఆ ముళ్ళ స్వభావం. అనుభవిస్తేగాని తెలియని ఒక అనిర్వచనీయం ఈ ప్రేమ గులాబీ...!!!"

Saturday, January 7, 2012

2011...!!!

           మనిషికి ఎన్నో కోరికలు మరియు లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ... మరెన్నో ప్రయాసలు ...! అందులో కొన్ని నెరవేరుతాయి, మరికొన్ని అసంపూర్తిగా ఉంటాయి, మరిన్ని నెరవేరకుండా కలలుగానే ఉంటాయి. వీటిలో మధురానుభూతులు కొన్నైతే... మనసుకి మిన్నంటే బాధను మిగుల్చుతాయి మరికొన్ని... కొన్నైతే గుణగణాలను నేర్పేవిగా ఉంటాయి. నా జీవితంలో 2011 సంవత్సరం గుణ సాధన సంవత్సరంగా నిలిచింది. ఎందుకంటే ... నాలో దాగివున్న ఎన్నో బలహీనతలను బయటికి తెచ్చినది 2011. ఇక జీవితంలో తిరిగి రాదనుకున్న హృదయపు ఆలోచన ... ఆవిరిగా మారిందనుకున్న జీవితానికి ...వర్షపు రూపంలో నా బాటలో మళ్లీ ఎదురై , నా ఆలోచనాపరిధిని విస్తృతం చేసింది. ఈ హృదయాలోచన నన్ను విడిచి మళ్ళీ వెళ్లకూడదని ... ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా వేడుకుంటున్నాను...!!!