"గులాబీని ప్రేమకు గుర్తుగా ఎందుకు భావించాలి...?" - ఈ ప్రశ్న ఒక స్నేహితురాలి సందేహానికి ప్రతిరూపం ...!
ఎలా అయితేనేం ఈ ఒక్క ప్రశ్న నాలో ఇన్ని రోజులుగా దాగివున్న, బయటికిరాని నా అనుభవాలని మీతో పంచుకోవడానికి ఒక వారధి అయ్యింది.
" ఆకర్షించే అందమే కాదు... ఆ అందంలో ఉండే అమాయకత్వానికి గులాబీ ఒక ప్రతిరూపం. ఒక గులాబీ జీవితానికి అవసరమైన అన్ని అంశాలను ఎంతో చక్కగా వివరిస్తుంది. మా పెరట్లో మూడు గులాబీ మొక్కలను పెంచుతున్నాము, అందులో ఒకదానికి గులాబీల ఊసే తెలియదు. ఇక రెండవది, మొదట్లో లేత గులాబీల అందంతో నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత ఇది కూడా గులాబీలను మాకు ఇవ్వడం ఆపేసింది. ఇక మూడవది, కాస్త ఆలస్యంగానైనా ... ఎంతో అందమైన, ఆకర్షణీయమైన మరియు అమాయకత్వపు గులాబీలను మాకు అందిస్తోంది... వాటి వికసించే గుణం ఎలా ఉందంటే .. మొగ్గ పూర్తిగా వికసించడానికి సుమారుగా పది రోజుల సమయం పడుతోంది! పదోరోజు మాత్రం వాడిపోయే స్థితికి వచ్చేస్తోంది. మాకు ఆ వాడిన అందాన్ని చూస్తున్నపుడు బాధగా వున్నా ... అది కొద్ది రోజులకే మరో కొత్త గులాబీ అందంతో మాకు తిరిగి దర్శనమిస్తోంది. మన జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఇంతే!!! మనకు కొన్ని నెరవేరకుండా మిగిలిపోతే ...మరికొన్ని చేయిదాకా వచ్చి చేజారుతాయి ... ఇంకొన్ని నెరవేరి ....కొత్త అవకాశాలను కూడా సృస్టిస్తాయి... జీవితానికి ఆనందాన్నిస్తాయి, ఆ ఆనందం మన ముఖానికి అందాన్నిస్తుంది.!!!
ఇక నేను ప్రేమకు నిర్వచనం చెప్పేంత గొప్పవాడిని కాదు... కాని కొన్ని విషయాలు మాత్రం చెప్పగలను. ప్రేమ అనేది గులాబీ అంత అందంగా ఉంటుంది. అయితే ఇంతగా ఆకర్షించే ఆ అందమైన ప్రేమలో కొన్ని భయాలు ...ఆందోళనలు కూడా ఉంటాయి. గులాబీని దూరం నుండి చూస్తే ఎవరికైనా ఆకట్టుకునే విధంగానే కనిపిస్తుంది. కాని , ఆ అందమైన గులాబీ రేకుల కిందవుండే ముళ్ళు గుచ్చినప్పుడు ఉండే బాధ అనుభవించినవారికే తెలుస్తుంది. ఆ ముళ్ళు ప్రేమను రక్షించేవే కావచ్చు... ప్రేమను తిరస్కరించేవే కావచ్చు లేక ప్రేమించే వ్యక్తి తనకు తానుగా ఇతరులకు దూరంగా ఉండటానికి సృష్టించుకున్నవే కావచ్చు. ఏదేమైనా ఆ గులాబీని మనం ప్రేమించే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఆ ముళ్ళ స్వభావం. అనుభవిస్తేగాని తెలియని ఒక అనిర్వచనీయం ఈ ప్రేమ గులాబీ...!!!"
this one is an awesome post..enjoyed it truely..
ReplyDelete